ప్రియమైన క్రీస్తు విశ్వాసులారా, పునీత ఆంథోనీ పుణ్యక్షేత్ర భక్తులారా,
మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు.
పునీత ఆంథోనీ వారి పుణ్యక్షేత్ర వెబ్సైట్ను ప్రారంభించడం ఎంతో ఆనందదాయకమైన విషయం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ, విశ్వాసులను దేవునికి మరింత చేరువ చేయడానికి, ప్రార్థనలో ఐక్యపరచడానికి మరియు సువార్త సందేశాన్ని అందరికీ చేరవేయడానికి ఈ వెబ్సైట్ ఒక మంచి వేదికగా నిలుస్తుందని నేను విశ్వసిస్తున్నాను.
పునీత ఆంథోనీ గారు తమ జీవితమంతా దేవుని ప్రేమను, వినయాన్ని, పేదల పట్ల కరుణను మరియు మానవ సేవను ప్రతిబింబించారు. వారి జీవితం మనందరికీ విశ్వాసంలో ఆదర్శం.
ఈ పవిత్ర పుణ్యక్షేత్రం అనేకమంది భక్తులకు ఆధ్యాత్మిక బలాన్ని, మనశ్శాంతిని మరియు నూతన ఆశను అందించే ప్రార్థనా కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఇక్కడికి విచ్చేసే ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమను అనుభవిస్తూ, విశ్వాసంలో నూతన ఉత్సాహాన్ని పొందుతున్నారు.
ఈ పుణ్యక్షేత్ర ఆధ్యాత్మిక అభివృద్ధికి కృషి చేస్తున్న రెక్టర్ మరియు విచారణ గురువులు Rev. Msgr. అల్లం శౌరెడ్డి V.G.గారికి విచారణ సభ్యులకు, మరియు భక్తులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీ నిస్వార్థ సేవ, అంకితభావం మరియు ప్రార్థనాభరిత సహకారం దేవుని రాజ్య నిర్మాణానికి దోహదపడుగాక.
ప్రియమైన విశ్వాసులారా, పునీత ఆంథోనీ గారి విశ్వాస జీవితం నుండి స్ఫూర్తి పొంది, మన కుటుంబాలలో ప్రేమను, సమాజంలో ఐక్యతను, పేదల పట్ల కరుణను మరియు మన జీవితాలలో క్రీస్తు విలువలను పెంపొందించుకుందాం.
పునీత ఆంథోనీ గారి మధ్యవర్తిత్వ ప్రార్థనల ద్వారా సర్వశక్తిమంతుడైన దేవుడు మీ అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించుగాక.
ఈ పుణ్యక్షేత్రం విశ్వాసానికి, ప్రార్థనకు, ప్రేమకు మరియు సేవకు నిరంతర సాక్ష్యంగా నిలవాలని కోరుకుంటూ నా ఆశీస్సులను మీ అందరికీ అందజేస్తున్నాను.
దీవెనలతో,
+ Most.Rev.Ch.Bhagyaiah.
Bishop of Guntur.