పరలోకమునకు భూలోకమునకు కర్త ఎవరు?
జ. సర్వేశ్వరుడు
ఎందరు సర్వేశ్వరులు?
జ. ఒకే సర్వేశ్వరుడు, కాని, త్రిత్వవంతుడై యున్నాడు.
సర్వేశ్వరుడు త్రిత్వవంతుడైయున్నాడునటకు అర్థము ఏమి?
జ. పిత, పుత్రుడు, పవిత్రాత్మ అను ముగ్గురు వ్యక్తులు ఉన్నారనియు, ఆ ముగ్గురు వ్యక్తులకు స్వభావము ఒకటేనని అర్థము.
ఆ ముగ్గురు వ్యక్తుల పేరులేమి ?
జ. పిత, పుత్రుడు, పవిత్రాత్మ.
పిత సర్వేశ్వరుడా?
జ. సర్వేశ్వరుడు
పుత్రుడు సర్వేశ్వరుడా?
జ. సర్వేశ్వరుడు
పవిత్రాత్మ సర్వేశ్వరుడా?
జ. సర్వేశ్వరుడు.
ఈ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు సర్వేశ్వరులా, లేక ఒకే సర్వేశ్వరుడా?
జ. ఒకే సర్వేశ్వరుడు.
ఈ ముగ్గురు వ్యక్తులు ఎందువలన ఒకే సర్వేశ్వరుడై యున్నాడు?
జ. ఈ ముగ్గురికినీ ఒకే జ్ఞానము, ఒకే చిత్తము, ఒకే శక్తి ఒకే దేవ స్వభావము ఉండుటవలన ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే సర్వేశ్వరుడై యున్నాడు.
వీరలయందు శక్తి, మహిమ మొదలైన లక్షణములలో భేదము కలదా?
జ. భేదములేదు, ఈ ముగ్గురు వ్యక్తులు అన్నిటిలో సరిసమానులు.
వీరిలో ముందటి వ్యక్తియు, వెనుకటి వ్యక్తియుగలరా?
జ. లేరు.
ఎందువలన లేరు?
జ. పిత, పుత్రుడు, పవిత్రాత్మ ఆరంభములేని వారై యుండుటవలన వీరిలో ముందటి వ్యక్తి లేడు, వెనుకటి వ్యక్తి లేడు.
సర్వేశ్వరునికి ముఖ్య లక్షణములు ఎన్ని?
జ. ఆరు:
సర్వేశ్వరుడు తనంతట తానే యున్నాడు.
ఆరంభములేక యున్నాడు.
శరీరములేక యున్నాడు.
మితిలేని సకల మేలుల స్వభావము కలిగియున్నాడు.
అంతట ఉన్నాడు.
పరలోకమునకు భూలోకమునకు మూల కారణమైయున్నాడు.
సర్వేశ్వరుడు పరలోకమునకు భూలోకమునకు ఎటుల మూల కారణమైయున్నాడు?
జ. సర్వేశ్వరుడు పరలోకమును, భూలోకమును వానిలో నుండు సకల వస్తువులను సృష్టించి కాపాడుటవలన సర్వమునకు మూలకారణమైయున్నాడు.
సర్వేశ్వరుడు సృష్టించిన వస్తువులలో శ్రేష్ఠమైనవి ఏవి?
జ. శరీరములేని సన్మనస్కులు, ఆత్మశరీరములుగల మనుష్యులు.
సర్వేశ్వరుడు సన్మనస్కులను ఎటువంటి స్థితిలో సృష్టించెను?
జ. పరిశుద్ధమును, సుఖమునైన స్థితిలో సృష్టించెను.
సన్మనస్కులందరు తమ శ్రేష్ఠమైన స్థితిలో స్థిరముగా నుండిరా?
జ. లేరు, కొందరు గర్వముచేత సర్వేశ్వరుని ఆజ్ఞమీరి నందున నరకములో త్రోయబడిరి.
ఇట్లు చెడిపోయిన సన్మనస్కుల పేర్లేమి?
జ. పిశాచులు
సర్వేశ్వరుడు మనుష్యులను ఎందుకు సృష్టించెను?
జ. ఈలోకములో తనను తెలిసికొని, ప్రేమించి సేవించి అటువెనుక మోక్షము పొందుటకు మనుష్యులను సృష్టించెను.
సర్వేశ్వరుడు ఆది తల్లి దండ్రులను ఎటువంటి స్థితిలో సృష్టించెను?
జ. పరిశుద్ధమును, భాగ్యమునైన స్థితిలో సృష్టించెను.
ఆది తల్లి దండ్రులు ఆ పరిశుద్ధమును, భాగ్యమునైన స్థితిని ఎటుల పోగొట్టుకొనిరి?
జ. సర్వేశ్వరుడు తినవద్దనిన పండును వారలు తిని పాపము కట్టుకొనిరి.
ఆది తల్లిదండ్రుల పాపముచేత వారు మాత్రమే ఆ పరిశుద్ధమును భాగ్యమునైన స్థితిని పోగొట్టుకొనిరా?
జ. లేదు, తన సంతతి వారలకును దానిని పోగొట్టెను.
ఆ పరిశుద్ధమును, భాగ్యమునైన స్థితి ఆది తండ్రి సంతతివారలకు ఎందువలన పోయెను?
జ. ఆదితండ్రి మనుష్యులందరికి తండ్రియై ఉన్నందువలన అందరు పుట్టుకతోనే ఆ పాప కళంకమును పొందుచున్నారు.
ఆ పాప కళంకము పేరు ఏమి?
జ. జన్మ పాపము.
జన్మ పాపముచేత మనుష్యులు ఏ శిక్షకు పాత్రులైరి?
జ. మోక్షమును పోగొట్టుకొని, పిశాచికి దాసులై మరణమునకును, ఇతర బాధలకును పాత్రులైరి.
జన్మ పాపము ఎటుల పరిహారమై పోవును?
జ. జ్ఞానస్నానముచేత మాత్రమే పరిహారమై పోవును.
మనుష్యులను రక్షించుటకు మనుష్యుడై పుట్టినవారెవరు?
జ. మహా పరిశుద్ధ ఏక త్రిత్వముయొక్క రెండవ వ్యక్తియగు పుత్రుడైన సర్వేశ్వరుడు.
పుత్రుడైన సర్వేశ్వరుడు ఏలాగు మనుష్యుడై పుట్టెను?
జ. పవిత్రాత్మవలన అద్భుతముగా గర్భమై ఎప్పటికిని కన్య మహిమ చెడని కన్యమరియమ్మనుండి పుట్టెను.
పుట్టిన ఎనిమిదవ దినమున లోక రక్షకునకు ఏమి పేరు పెట్టిరి?
జ. జేసు అను పేరు పెట్టిరి.
జేసులను పేరునకు అర్థమేమి?
జ. మనుష్యుల రక్షకుడు
జేసునాథుడు ఈలోకములో ఎన్ని సంవత్సరములుండెను?
జ. ముప్పదిమూడు సంవత్సరములుండెను.
జేసునాథుడు ఈలోకమందు ఏమి చేసెను?
జ. సకల పుణ్య క్రియలను, అనేక అద్భుతములను చేసి సత్యవేదమును బోధించి అపోస్తులను నియమించెను.
జేసునాథునికి ఎన్ని స్వభావములు గలవు?
జ. దేవ స్వభావము, మనుష్య స్వభావము అను రెండు స్వభావములు కలవు.
జేసునాథుడు ఏ స్వభావమున పాటుబడెను?
జ. మనుష్య స్వభావమున పాటుబడెను.
జేసునాథుడు ఎవరికొరకు పాటుబడెను?
జ. మానవులందరికొరకు పాటుబడెను.
జేసునాథుడు ఏలాగున పాటుబడెను?
జ. పొంస్య పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి సిలువమీద కొట్టబడి మరణముపొంది సమాధిలో ఉంచబడెను.
అప్పుడు జేసునాథుని దివ్య ఆత్మ ఎక్కడికి పోయెను?
జ. పాతాళము అను పితాపితృల స్థలమునకు దిగెను.
జేసునాథుని దివ్య ఆత్మ అచటికి ఎందుకు దిగెను?
జ. అచ్చట పుణ్యాత్ములు త్వరలో మోక్షము పొందుదురని తెలియజేయుటకు పాతాళమునకు దిగెను.
జేసునాథుడు సమాధినుండి లేచైనా?
జ. మూడవనాడు జీవముతో లేచెను.
జేసునాథుడు సమాధినుండి లేచిన వెనుక భూలోకములో ఎన్ని దినములుండెను?
జ. నలుబది దినములుండెను.
జేసునాథుడు నలుబది దినములు ఏమి చేసెను?
జ. పలుమార్లు అపోస్తులకు అగుపడి, వారల విశ్వాసమును దృఢపరచి, వారలకు తిరుసభ మీద అధికారమిచ్చెను.
జేసునాథుడు నలుబదియవ దినమున ఎక్కడికిపోయెను?
జ. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడిప్రక్కన కూర్చుండియున్నాడు.
జేసునాథుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?
జ. దేవ స్వభావమున అంతటయున్నాడు. మనుష్య స్వభావమున పరలోకమందును, దివ్య సత్ప్రసాద మందును ఉన్నాడు.
జేసునాథుడు పరలోకమునకు ఎక్కిన పదియవ దినమందు ఏమి చేసెను?
జ. తన అపోస్తులులకు పవిత్రాత్మయైన సర్వేశ్వరుని పంపెను.
జేసునాథుడు పవిత్రాత్మను ఎందుకు పంపెను?
జ. తిరుసభను వ్యాపకంచేసి దానిని ఏర్పరచుటకు అపోస్తులులకు విశేషమైన జ్ఞానమును, దైవ సహాయమును ఇచ్చుటకు పవిత్రాత్మను పంపెను.
పవిత్రాత్మను పొందిన వెనుక అపోస్తులు ఏమి చేసిరి?
జ. నానా దేశములలో బోధించి, తిరుసభను ఏర్పరచిరి.
తిరుసభయొక్క అధిపతి ఎవరు?
జ. జేసునాథుడు.
జేసునాథుడు తనకు బదులుగా తిరుసభకు అధిపతియై యుండుటకు ఎవరిని నియమించెను?
జ. పునీత రాయప్పును నియమించెను.
పునీత రాయప్పుకు బదులుగా తిరుసభకు అధిపతి ఎవరు?
జ. పరిశుద్ధ పాపుగారు.
ఇతర అపోస్తులకు బదులుగా నుండువారెవరు?
జ. మేత్రాణులు
జేసునాథుడు ఎన్ని సభలను స్థాపించెను?
జ. జేసునాథుడు ఒకే కతోలిక సభను స్థాపించెను. దానిని మాత్రమే అపోస్తులు ఏర్పరచిరి.
పాపము నిమిత్తము సకల మనుష్యులకు వచ్చిన శిక్ష ఏమి?
జ. మరణము
మరణము వెనుక ఏమి జరుగును?
జ. ప్రత్యేక తీర్పు.
ప్రత్యేక తీర్పు వెనుక భారీపైన పాపముగల ఆత్మలు ఎక్కడికి పోవును?
జ. నరకమునకు పోవును.
పరిశుద్ధాత్మలు ఎక్కడికి పోవును?
జ. మోక్షమునకు పోవును.
తమ పాపముల కొరకు పూర్తిగా ఉత్తరింపని పుణ్యవంతుల ఆత్మలు ఎక్కడికి పోవును?
జ. ఉత్తరించే స్థలమునకు పోవును.
ఉత్తరించే స్థలములో అవి అనుభవించు బాధలు ఏవి?
జ. దేవుని చూచు భాగ్యములేక, తమ పాపములకు తగిన శిక్షను అనుభవించి ఉత్తరించును, పూర్తిగా ఉత్తరించిన వెనుక మోక్షము పొందుదురు.
ప్రత్యేక తీర్పుగాక వేరేయొక తీర్పుగలదా?
జ. సాధారణ తీర్పు గలదు.
అది ఎప్పుడు జరుగును?
జ. లోకాంత్యమున జరుగును.
లోకము ఎటుల ముగియును?
జ. లోకమంతయు అగ్నిచేత నాశనమగును. మనుష్యులందరు చనిపోవుదురు.
అప్పుడు ఏమి సంభవించును?
జ. జేసునాథుడు మనుష్యులందరిని ఆత్మ శరీరములతో లేపి, మహా ప్రతాపముతో తీర్పు చేయుటకు వచ్చును.
జేసునాథుడు న్యాయతీర్పు ఎటుల చేయును?
జ. ఒక్కొక్కని పాప పుణ్యములు అందరి యెదుట తెలియపరచి, పాపాత్ములను శపించి నరకమునత్రోసి, పుణ్యాత్ములను ఆశీర్వదించి తనతో మోక్షమునకు తోడుకొనిపోవును.
పాపాత్ములు నరకమందు అనుభవించు బాధలు ఏవి?
జ. సర్వేశ్వరుని ఎన్నటికిని చూడక కలంతకాలము పిశాచులతో అగ్నియందే కాలి సర్వబాధలను అనుభవించెదరు.
పుణ్యాత్ములు మోక్షములో అనుభవించు భాగ్యమేమి?
జ. సర్వేశ్వరుని ముఖాముఖిగా దర్శించి, కలంతకాలము సకల భాగ్యములను అనుభవించెదరు.
మోక్షము పొందుటకు ఏమి చేయవలెను?
జ. వేదసత్యములను విశ్వసించుచు, పాపములను కట్టుకొనక పుణ్య క్రియలను చేయవలయును.
పాపము అనగా నేమి?
జ. సర్వేశ్వరుడు ఆజ్ఞాపించిన దానిని బుద్ధివివరము తెలిసినవెనుక మనసొప్పి మీరుటయే పాపము.
సర్వేశ్వరుడు ఏమి ఆజ్ఞాపించుచున్నాడు?
జ. పది ఆజ్ఞలను, తిరుసభ అధికారముగల యితర కట్టడలను.
పాపము ఎన్ని విధములుగా నున్నది?
జ. చావైన పాపము, స్వల్ప పాపము అను రెండు విధములుగా నున్నది.
చావైన పాపము అనగా నేమి?
జ. దేవయిష్ట ప్రసాదమును పోగొట్టి మనలను నరకమునకు పాత్రులను చేయు పాపము.
స్వల్ప పాపము అనగా నేమి?
జ. దేవయిష్ట ప్రసాదమును పోగొట్టక మనలను ఉత్తరించు స్థలమునకు పాత్రులను చేయు పాపము.
పుణ్యములలో ప్రధానమైనవి ఎన్ని?
జ. మూడు : విశ్వాసము, నమ్మిక, దేవప్రేమ.
ఈ మూడు పుణ్యములు ఎందుకు ప్రధానమైనవి?
జ. మనుష్యులకు ఈ మూడు పుణ్యములలో ఏదొకటి లేని యెడల మోక్షము లేదు.
పాపము కట్టుకొనక మోక్షము పొందుటకు మన సొంత బలము చాలునా?
జ. చాలదు. దేవవరప్రసాదము అవసరమైయున్నది.
దేవవరప్రసాదమనగా నేమి?
జ. మోక్షము పొందుటకు సర్వేశ్వరుడు మనకు ఉచితముగా దయచేయు దైవ వరమే దేవవరప్రసాదము.
దేవవరప్రసాదమును ఎటుల పొందగలము?
జ. జపము వలనను, దేవద్రవ్యానుమానముల వలనను పొందగలము.
జపము అనగా నేమి?
జ. భక్తిగలిగి దేవునితో సంభాషించుటయే జపము.
సర్వేశ్వరునిగాక లోక విషయములను గూర్చి మనసొప్పి తలంచుచు చేసిన జపము మంచి జపము అగునా?
జ. కాదు. సర్వేశ్వరుడు ఇట్టి జపము ఆలకించడు.
దేవద్రవ్యానుమానము అనగా నేమి?
జ. దేవవరప్రసాదములను యిచ్చుటకు జేసునాథుడు స్థాపించిన సాధనము.
దేవద్రవ్యానుమానములు ఎన్ని? అవి ఏవి?
జ. ఏడు. జ్ఞానస్నానము, భద్రమైన అభ్యంగము, దివ్య సత్ప్రసాదము, పాపసంకీర్తనము, అవస్థ అభ్యంగము, గురుపట్టము, జ్ఞాన వివాహము.
ఏ దేవద్రవ్యానుమానములను ఒక్కసారి మాత్రమే పొందవచ్చును?
జ. జ్ఞానస్నానము, భద్రమైన అభ్యంగము, గురుపట్టము.
జ్ఞాన స్నానము అనగా నేమి?
జ. జన్మపాపమును ఇతర పాపములను పోగొట్టి మనలను సర్వేశ్వరునికి, తిరుసభకు బిడ్డలనుగా చేయు దేవద్రవ్యానుమానము.
జ్ఞానస్నానము సాధారణముగా యిచ్చువారెవరు?
జ. గురువులు.
మరణ అవస్థలో ఎవరైనను జ్ఞానస్నానము ఇవ్వవచ్చునా?
జ. అట్టి సమయమున ఎవరైనను జ్ఞానస్నానము ఇవ్వవచ్చును.
తిరుసభయొక్క తలంపు ప్రకారము జ్ఞానస్నానము యిచ్చుట ఎటుల?
జ. జ్ఞానస్నానము ఇచ్చువాడు దానిని పొందువాని తలమీద నీళ్ళుపోయుచు, పేరుచెప్పి “పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున నేను నిన్ను కడుగుచున్నాను” అని చెప్పవలెను.
పసిబిడ్డలకు మాత్రమేగాక బుద్ధి వివరములను తెలిసిన వారలకు మరణావస్థలో జ్ఞానస్నానము ఇవ్వవచ్చునా?
జ. మరణావస్థలో జ్ఞానస్నానము కోరినవారికి ప్రధాన సత్యములను తెలియపరచి, పాపములకొరకు దుఃఖము పుట్టించి జ్ఞానస్నానము ఇవ్వవలయును.
ఆ ప్రధాన సత్యములేన్ని?
జ. నాలుగు : 1. ఒకే సర్వేశ్వరుడు ఉన్నాడు. 2. ఒకే సర్వేశ్వరునియందు పిత, పుత్ర, పవిత్రాత్మ అను ముగ్గురు వ్యక్తులున్నారు. 3. పుత్రుడైన సర్వేశ్వరుడు మనుష్యావతారమెత్తి మనుష్యులను రక్షించెను. 4. సర్వేశ్వరుడు పుణ్యాత్ములకు మోక్షము దయచేసి పాపాత్ములకు నరక బాధలను విధించును.
ఈ నాలుగు సత్యములను తెలియని వారికి జ్ఞాన స్నానము ఇచ్చిన యెడల చెల్లునా?
జ. చెల్లదు.
భద్రమైన అభ్యంగము అనగా నేమి?
జ. వేద సత్యములో మనలను దృఢపరచుటకు పవిత్రాత్మ అయిన సర్వేశ్వరునియొక్క జ్ఞానవరములను, అనుగ్రహములను ఇచ్చు దేవద్రవ్యానుమానము.
భద్రమైన అభ్యంగము యోగ్యముగా పొందుటకు చేయవలసిన ఆయత్తమేమి?
జ. వేద సత్యములు నేర్చుకొని, పవిత్రాత్మయొక్క జ్ఞాన వరములను అనుగ్రహములను పొంద ఆశించి, చావైన పాపములేక ఉండవలెను.
పవిత్రాత్మ సర్వేశ్వరుని జ్ఞాన వరములు ఎన్ని?
జ. ఏడు : 1) జ్ఞానము 2) బుద్ధి 3) విమర్శ 4) దృఢము 5) తెలివి 6) భక్తి 7) దేవభయము.
పవిత్రాత్మ సర్వేశ్వరుని అనుగ్రహములు ఎన్ని?
జ. పన్నెండు : 1) సోదరప్రేమ 2) జ్ఞాన సంతోషము 3) సమాధానము 4) ఓర్పు 5) దయ 6) మేలెరిగిన తనము 7) తాళిమి 8) శాంతి 9) విశ్వాసము 10) మర్యాద 11) నిగ్రహము 12) విరక్తత్వము.
భద్రమైన అభ్యంగము ఇచ్చుటకు అధికారముగల వారెవరు?
జ. మేత్రాణులు.
దివ్యసత్ప్రసాదమనగా నేమి?
జ. గోధుమ అప్పము యొక్కయు, ద్రాక్షారసము యొక్కయు గుణములలో జేసునాథుని దివ్య ఆత్మ, దివ్య శరీరము, దివ్య రక్తము, దేవ స్వభావము వేంచేసియుండు దేవద్రవ్యానుమానము.
దివ్యసత్ప్రసాదమందు అప్పము ఉన్నదా?
జ. అప్పము యొక్క రూపము, రుచి మొదలగు గుణములుండినను, అప్పము లేదు.
అప్పము ఏమై పోవును?
జ. దివ్యపూజలో జేసునాథుని దివ్య ఆత్మ, దివ్య శరీరము, దివ్య రక్తము దేవ స్వభావమైపోవును.
జేసునాథుడు దివ్య సత్ప్రసాదమును స్థాపించుటకు కారణములేన్ని?
జ. మూడు : 1. మన ఆత్మకు దివ్య భోజనమై ఉండుటకు 2. మనతో వాసము చేయుటకు 3. తన మరణమును జ్ఞాపక పరచుకొనుటకు దివ్యసత్ప్రసాదమును స్థాపించెను.
దివ్యసత్ప్రసాదము మన ఆత్మకు ఎటుల దివ్యభోజనమైయున్నది?
జ. భోజనము శరీరమునకు బలము ఇచ్చునటుల దివ్య సత్ప్రసాదము లోకొనుటవలన, జేసునాథుని దివ్య ఆత్మ, దివ్య శరీరము, దివ్య రక్తము, దేవ స్వభావము, ఆత్మకు జ్ఞానబలము ఇచ్చును కనుక ఆత్మకు దివ్య భోజనమై యున్నది.
జేసునాథుడు మనయందు ఎందుకు వేంచేయుచున్నాడు?
జ. పాపాత్ములమైన మనకు తన మితిలేని ప్రేమను చూపుటకును, మనలను పాపమునుండి కాపాడుటకు వేంచేయుచున్నాడు.
దివ్యసత్ప్రసాదమును లోకొనిన వెనుక మనము ఏమి చేయవలయును?
జ. మనయందు వేంచేసిన జేసునాథుని నిండు విశ్వాసముతో ఆరాధించి మనకు కావలసిన మేలులను అడుగుకొనవలయును.
దివ్య సత్ప్రసాదమును లోకొనుటకు ఎన్ని ఆయత్తములు కావలయును?
జ. ఆత్మ ఆయత్తము, శరీరము ఆయత్తము అను రెండు ఆయత్తములు కావలయును.
ఆత్మ ఆయత్తమనగా నేమి?
జ. ఆత్మ చావైన పాపములేక ఉండవలయును.
శరీర ఆయత్తమనగా ఏమి?
జ. దివ్య సత్ప్రసాదము లోకొనుటకు ముందు ఒక గంట కాలము ఉపవాస ముండవలయును. మంచి నీళ్ళు ఈ ఉపవాసమును చెరుపదు.
జేసునాథుడు దివ్యసత్ప్రసాదములో ఎటుల మనతో వాసము చేయుచున్నాడు?
జ. జేసునాథుడు పీఠముమీద దేవ మందసములో దివారాత్రములు వాసము చేయుచు మన మనవులన్నిటిని ఆలకించుచున్నాడు.
జేసునాథుడు దివ్యసత్ప్రసాదముచేత తన మరణమును మనకు ఎటుల జ్ఞాపక పరచుచున్నాడు?
జ. తాను సిలువమీద సమర్పించిన బలిని, దివ్య సత్ప్రసాదము ద్వారా ఎల్లప్పుడును పూజలో సమర్పించుటవలన తన మరణమును జ్ఞాపక పరచుచున్నాడు.
దివ్య పూజ యొక్క ముఖ్య భాగములేన్ని?
జ. మూడు : 1. దైవ వాక్యార్చన. 2. కృతజ్ఞతార్చన. 3. సత్ప్రసాద క్రమము.
దివ్యపూజ సర్వేశ్వరునికి ఎందుకు సమర్పింపబడుతున్నది?
జ. సర్వేశ్వరునికి ఆరాధనయు మేలెరిగిన స్తోత్రమును చేయుటకు.
మనము దేవవరప్రసాదములను, పాపములకు రాదగిన అనిత్య శిక్షల తొలగింపును పొందుటకు దివ్యపూజ సర్వేశ్వరునకు సమర్పింపబడుచున్నది.
పాప సంకీర్తనము అనగా నేమి?
జ. జ్ఞానస్నానము పొందిన వెనుక కట్టుకొనిన పాపములను మన్నించు దేవద్రవ్యానుమానము.
పాప సంకీర్తనము చేయుటకు ఎన్ని కార్యములు కావలయును?
జ. ఐదు : 1. తాను చేసిన పాపములను జ్ఞాపక పరచుకొనుట, 2. తాను చేసిన పాపముల కొరకు పశ్చాత్తాపపడుట. 3. ఇక పాపములను చేయనని గట్టి ప్రతిజ్ఞ చేయుట. 4. తాను చేసిన చావైన పాపములన్నిటిని గురువునకు బయలు పరచుట. 5. గురువు కట్టడజేసిన అపరాధమును తీర్చుట.
అవస్థ అభ్యంగము అనగా నేమి?
జ. వ్యాధిగ్రస్తుల ఆత్మ శరీరములకు ఆదరణ నిచ్ఛెడు దేవద్రవ్యానుమానము.
అవస్థ అభ్యంగము పొందుటకు వ్యాధిగ్రస్తులు ఏమి ఆయత్తము చేయవలయును?
జ. సర్వేశ్వరుని చిత్తమునకు, నిండు మనస్సుతో లోబడి, సర్వేశ్వరుని మీద నమ్మకముంచి చావైన పాపములేక ఉండవలయును.
గురుపట్టము అనగా నేమి?
జ. దివ్యపూజ చేయుటకు, గురు సంబంధమైన, ఇతర కార్యములను నెరవేర్చుటకు అధికారమును, దేవవరప్రసాదములను ఇచ్చెడు దేవద్రవ్యానుమానము.
జ్ఞాన వివాహము అనగా నేమి?
జ. దంపతులు సన్మార్గమున నడచుటకు, బిడ్డలను పుణ్య మార్గములో నడిపించుటకును, దేవవరప్రసాదములను ఇచ్చెడు దేవద్రవ్యానుమానము.